Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ డిమాండ్

Author Thirupathi Pannala | 17 Oct 2026, 05:50 PM | Politics, TELANGANA, పెద్దపల్లి
రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ డిమాండ్

రాఘవపూర్ సబ్‌స్టేషన్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా

పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 17 తెలంగాణ అడ్డా
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటిని సకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, రైతులు పెద్దపల్లి మండలం రాఘవపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.

రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ డిమాండ్ - Additional Image

బీజేపీ రాష్ట్ర శాఖ, కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ, పెద్దపల్లి జిల్లా శాఖ పిలుపు మేరకు శనివారం ఉదయం నిర్వహించిన ఈ ధర్నాలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తరచూ విద్యుత్ కోతలు విధించడంతో వ్యవసాయ మోటార్ల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, విద్యుత్ సరఫరా ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు తగిన సమయంలో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ డిమాండ్ - Additional Image

అలాగే ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీటిని ముందుగానే విడుదల చేసి ఉంటే రైతులకు ప్రయోజనం కలిగేదని, నీటిని సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ కిసాన్ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కట్కూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని, విద్యుత్ కోతల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, సాగునీరు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతుల విద్యుత్, సాగునీటి సమస్యలను పరిష్కరించాలి – బీజేపీ డిమాండ్ - Additional Image

బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తూకం పేరుతో రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో రైస్ మిల్లులపై అధికారులు తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, సాగునీరు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిరంతర విద్యుత్ సరఫరా, సకాలంలో సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శివంగారి సతీష్, యువ మోర్చా అధ్యక్షులు రామగిరి అఖిల్, కందుల శ్రీనివాస్, నాగేశ్వర్, సంతోష్, రాజేందర్ రెడ్డి,శంకరయ్య,కల్లేపల్లి అంజి, వేణు, కుమార్,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు..