Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బిఆర్ఎస్ వంటావార్పు నిరసన

Author TELANGANA ADDA NEWS | 04 Sep 2026, 03:18 PM |
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బిఆర్ఎస్ వంటావార్పు నిరసన

మహిళలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారు

కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ‘వంటా వార్పు’ నిరసన

ప్రభుత్వ హామీల అమలుకు మహిళల పక్షాన పోరాటం కొనసాగిస్తాం: గంగుల కమలాకర్

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని, రాబోయే రోజుల్లో ప్రజలే ఆ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘వంటా వార్పు’ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మహిళలతో కలిసి వంటా వార్పులో పాల్గొన్న నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మహిళలకు ఇచ్చిన హామీలను విస్మరించారు

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆడబిడ్డల వివాహాలకు ‘కళ్యాణ లక్ష్మి’ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామని, విద్యార్థినులకు ఉచిత స్కూటీలు అందిస్తామని తదితర హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మహిళల పక్షాన పోరాటం కొనసాగిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రజాక్షేత్రంలో నిరసనలు చేపడుతున్నామని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా కాంగ్రెస్ పాలనలో సంతోషంగా లేదని అన్నారు.

కొండా సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ.. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం సన్నగిల్లింది: వినోద్ కుమార్

మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుందని, ఇంకా 825 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు.

కాంగ్రెస్ మంత్రివర్గం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, కొండా సురేఖ రూపంలో మొదటి వికెట్ పడిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని, రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.