Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

Author Mohammad azeem | 07 Sep 2026, 01:39 PM |
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మద్దతుగా నిలిచిన రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు.. ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ / తెలంగాణ అడ్డా
శాసనమండలి సభ్యుడు తాతా మధు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అసెంబ్లీలోని సభాపతి ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను నేరుగా కలిశారు. తాతా మధు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, స్పీకర్‌ను పరామర్శించి తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. స్పీకర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, అది మొత్తం రాజ్యాంగ వ్యవస్థను, శాసనసభ గౌరవాన్ని దిగజార్చడమేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన స్పీకర్ పదవికి ప్రతి ఒక్కరూ తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఒక అట్టడుగు, దళిత వర్గానికి చెందిన బిడ్డ శాసనసభ స్పీకర్‌గా కొనసాగుతుండటాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాకుండా ఉంటూ, తన పార్టీ నాయకుల ద్వారా బయట ఇలాంటి డ్రామాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయడంతో పాటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తన పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజ్యాంగ పదవిని అవమానించేలా మాట్లాడితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని, దీనికి ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. శాసనసభ సంప్రదాయాలను, స్పీకర్ పదవిని కనీసం గౌరవించని విధంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని, బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని హెచ్చరించారు.