Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గంగాధరలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన ఏసీపీ విజయ్‌కుమార్

Author Mohammad azeem | 07 Sep 2026, 05:19 PM |
గంగాధరలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా ముఠా అరెస్టు.. వివరాలు వెల్లడించిన ఏసీపీ విజయ్‌కుమార్

గంగాధర ప్రతినిధి / తెలంగాణ అడ్డా
తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మండల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన అంతర్‌జిల్లా దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ విజయ్‌కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కొండ శశికాంత్ (24) ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. గతంలో చిట్‌ఫండ్ ఏజెంట్‌గా, రేకుర్తిలోని హీరో షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేసిన ఇతను.. మద్యపానం, గంజాయి వంటి దురలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. ఆ అప్పులు తీర్చుకునే మార్గం లేక దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా గోవిందరావుపేటకు చెందిన సీహెచ్ సంతోష్, కరీంనగర్ కిసాన్ నగర్‌కు చెందిన గనవెల్లి వంశీలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డాడు.
గత నెల ఆగస్టు 28న ముగ్గురు నిందితులు స్కూటీపై గంగాధరకు చేరుకుని, ఒక ఇంట్లోని పై అంతస్తులో తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ బంగారు కమ్మలు, మట్టెలు, పట్టీలను అపహరించడమే కాకుండా.. మధురానగర్, కురిక్యాల గ్రామాల్లో మరో రెండు చోరీలకు పాల్పడినట్లు ఏసీపీ తెలిపారు.
సోమవారం మధురానగర్ చౌరస్తాలో దొంగిలించిన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడానికి తన ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 5 గ్రాముల రెండు బంగారు చెవుల మాటీలు, 4 గ్రాముల రెండు బంగారు చెవుల కమ్మలు, 6 తులాల రెండు వెండి పట్టీలతో పాటు దొంగతనానికి వినియోగించిన స్కూటీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు సీహెచ్ సంతోష్, గనవెల్లి వంశీల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణను, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఈ సమావేశంలో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ కూడా పాల్గొన్నారు.