Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం దుర్మార్గం ప్రజా సమస్యలను గాలికొదిలేసి సభా సమయం వృథా చేస్తున్నాయి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

Author Mohammad azeem | 08 Sep 2026, 07:48 PM |
రాజకీయ ప్రత్యర్థుల చావు కోరుకోవడం దుర్మార్గం ప్రజా సమస్యలను గాలికొదిలేసి సభా సమయం వృథా చేస్తున్నాయి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగా ఢీకొట్టాలే తప్ప, చావు కోరుకోవడం ఏమిటని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నోటి దురుసుతో ప్రత్యర్థి నాయకులను, కులాలను, వ్యవస్థలను దూషించడం, దుర్భాషలాడటం ఇదే మొదటిసారి కాదని, అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. అంటే ఆయన దూషణలను కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా అని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి అధికార పార్టీ నాయకులు దండయాత్రకు వెళ్లడం ఏమిటని, ఒక ముఖ్యమంత్రే తన పార్టీ నాయకులను ఇలాంటి దాడికి ఉసిగొల్పడం ఏంటని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని కవిత ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు అందక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే, 22ఏ నిషేధిత భూముల జాబితాలో తమ భూములు నమోదు కావడంతో రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడంతో నిరుద్యోగులు నిరాశలో ఉండగా, యూరియా దొరకక రైతులు అల్లాడిపోతున్నారు. జీవో 97ను రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు కోరుతుంటే, వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యాచారాలతో మహిళలు భయంభయంగా బతుకుతున్నారు. నాణ్యమైన భోజనం, వసతులు లేక గురుకులాల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా, పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏలు సహా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇలా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మాత్రం గత రెండు రోజులుగా విలువైన సభా సమయాన్ని వృథా చేశాయని కవిత తప్పుబట్టారు. ఇప్పటికైనా రేపటి నుంచి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, వాటికి పరిష్కారం చూపించే దిశగా సభలో చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.