Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. జంట నగరాల్లో భారీ వాన, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్

Author Mohammad azeem | 14 Sep 2026, 10:17 AM | TELANGANA
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. జంట నగరాల్లో భారీ వాన, 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
​ఆదివారం పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి చెరువులు నిండుకుండలను తలపిస్తుండగా, పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. తాజా వానలతో ఎల్నినో ఇబ్బందులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా శని, ఆది వారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. జంట నగరాల్లో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది.
​తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, కోఠి, అబిడ్స్, నారాయణగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, సనత్నగర్, తార్నాక, ఉప్పల్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి వరద నీరు చేరింది. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
​అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షం:
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శని, ఆదివారాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 9 జిల్లాల్లో వానలు జోరుగా పడ్డాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రంలో 19.1 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. ఈ జిల్లాలోని నెల్లికుదురు, నర్సింహులపేట, పెద్దవంగర, మహబూబాబాద్, దంతాలపల్లితో పాటు పలు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.
​పలు మండలాల్లో వర్షం:
వరంగల్‌ జిల్లాలోని పర్వతగిరి, నెక్కొండ, రాయపర్తి, వర్ధన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, చౌటుప్పల్, చిట్యాల, రామన్నపేట, వెలిగొండ, అడ్డగూడూరు, సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల మండలాల్లో భారీగా వానలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు సంభవిస్తున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లి చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. పలు మండలాల్లో కొన్నిచోట్ల పంటలు నీట మునిగాయి. అక్కడక్కడ రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
​‘ఎల్లంపల్లి’కి వరద:
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ వానలకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ జలాశయంలోకి వరద వస్తోంది. 5,537 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా, దిగువకు 389 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18 టీఎంసీలకు చేరుకుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 268 క్యూసెక్కుల నీటిని, ఎన్టీపీసీ విద్యుత్ అవసరాల కోసం 121 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
​నిలిచిపోయిన బొగ్గు తవ్వకాలు:
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంథని, రామగుండంలోని బొగ్గు గనుల్లో వర్షం నీరు చేరగా, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఓసీ-1, ఓసీ-2లలో 20 వేల క్యూబిక్ మీటర్ల బొగ్గు తవ్వకాలు నిలిచిపోయాయి. నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. భారీ యంత్రాలు సైతం కదలలేని పరిస్థితి నెలకొంది. ఉప్పొంగిన పాలేరు వాగు కారణంగా పెద్దముప్పారం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.