Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తండాలకు రోడ్డు లేక నరకయాతన ఐదేళ్లుగా హామీలే.. పనులు మాత్రం శూన్యం

Author TELANGANA ADDA NEWS | 14 Sep 2026, 11:40 PM |
తండాలకు రోడ్డు లేక నరకయాతన  ఐదేళ్లుగా హామీలే.. పనులు మాత్రం శూన్యం

తండాలకు రోడ్డు లేక నరకయాతన

ఐదేళ్లుగా హామీలే.. పనులు మాత్రం శూన్యం

వర్షం పడితే రాకపోకలకు తీవ్ర అంతరాయం

రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని తండాల ప్రజల డిమాండ్

వీర్నపల్లి, సెప్టెంబర్ 14 (తెలంగాణ అడ్డా):
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామ పరిధిలోని కేలోత్ తండా, శంకర్ నాయక్ తండా, రెడ్డి నాయక్ తండాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు తండాల్లో సుమారు 120 కుటుంబాలకు చెందిన 346 మంది నివసిస్తున్నప్పటికీ, ఏళ్లుగా కొనసాగుతున్న రహదారి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం వస్తే రాకపోకలు బంద్

ఇవి కూడా చదవండి

తండాలకు వెళ్లే రహదారులు మట్టి రోడ్లుగా ఉండటంతో వర్షాలు కురిసినప్పుడు బురదమయంగా మారుతున్నాయని ప్రజలు తెలిపారు. ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్నవారిని, గర్భిణులను ఆసుపత్రులకు తరలించేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోయారు.

ఐదేళ్లుగా హామీలకే పరిమితం

తండాలకు రోడ్డు మంజూరైందని గత ఐదేళ్లుగా చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆరోపించారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించినా ‘చూస్తాం.. చేస్తాం’ అనే హామీలకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన

ఎన్నికల సమయంలో తమ తండాలకు వచ్చే నాయకులు అనంతరం రహదారి సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీస రహదారి సౌకర్యం లేక రోజువారీ అవసరాల కోసం కూడా రాకపోకలు సాగించడం కష్టంగా మారిందని తెలిపారు.

తక్షణమే పనులు చేపట్టాలి

ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కేలోత్ తండా, శంకర్ నాయక్ తండా, రెడ్డి నాయక్ తండాలకు రహదారి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని తండాల ప్రజలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.