BRS Vs Congress:మీ మౌనం దేనికి సంకేతం.. రాహుల్‌కు కవిత సూటి ప్రశ్న
2nd Jun, 2025 03:59 PM
రాహుల్ గాంధీకి ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత. మీ మౌనం దేనికి సంకేతం అంటూ కవిత క్వశ్చన్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (AICC Leader Rahul Gandhi) హైదరాబాద్ పర్యటనపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పర్యటనకు సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కవిత పలు ప్రశ్నలు సంధించారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం అంటూ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారంటూ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల పాలనలో ప్రజలను రాచిరంపాన పెట్టిందంటూ వ్యాఖ్యలు చేశారు.
హైడ్రా, మూసీ పేరుతో ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని.. లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఒడిగట్టిందంటూ ఫైర్ అయ్యారు. సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని బంజారా యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షసకాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్దారించిందని తెలిపారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు.. వేధింపులు.. బెదిరింపులకు గురిచేశారన్నారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులతో ఇబ్బందులకు గురిచేశారన్నారు. తెలంగాణ ప్రజలు సోనియాగాంధీని, ప్రియాంకా గాంధీని, రాహుల్ గాంధీని నమ్మి అధికారమిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు.