సీఎం రేవంత్ రెడ్డితో హీరో నాగార్జున భేటీ
2nd Jun, 2025 03:33 PM
తన కుమారుడు అఖిల్ వివాహానికి ఆహ్వానం
సీఎం రేవంత్ రెడ్డితో హీరో అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తన సతీమణి అమలతో కలిసి జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. జూన్ 6వ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగే తన చిన్న కుమారుడు అఖిల్ - జైనాబ్ రవ్జీల పెళ్లికి రావాలని ఆహ్వానించారు. నాగార్జునకు చెందిన ''ఎన్ కన్వెన్షన్'' ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేయించింది. హైడ్రా అధికారులు, సిబ్బంది ఏకపక్షంగా కూల్చివేతలు చేపడుతున్నారని పేర్కొంటూ నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. అప్పటికే కూల్చివేత పూర్తయింది. ఈ వివాదం హైకోర్టులో విచారణలో ఉంది. ఇటీవల మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు చౌమహల్లా ప్యాలెస్ లో తెలంగాణ ప్రభుత్వం విందు ఏర్పాటు చేసింది. ఆ విందులో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు హీరో నాగార్జున కనిపించారు. ఇప్పుడు సీఎం నివాసానికి వెళ్లి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. దీంతో ఎన్ కన్వెన్షన్ కు సంబంధిత వివాదం సమసి పోయిందా అని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.