పెద్ద ప్యాకేజీ దొరికితే మా నేతలు బీఆర్‌ఎస్‌లో కలిసిపోతారు :
2nd Jun, 2025 05:04 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ - MLA RAJA SINGH COMMENTS ON BJP
బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ ద రికార్డులో ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది నిజమేనని తాను నమ్ముతున్నానని అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ పార్టీ పెద్ద నేతలు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ అభ్యర్థి ఎక్కడి నుంచి నిలబడాలనేది వాళ్లే నిర్ణయిస్తారని అన్నారు.
నోరు మూసుకొని కూర్చుంటున్నారు : గతంలో ఇదే జరిగిందని అందుకే బీజేపీ నష్టపోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో రావాలని, ఇప్పటివరకు ఎందుకు బీజేపీ గవర్నమెంట్ రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తమ నేతలు కుమ్ముకైపోయారని విమర్శించారు. అందువల్లే బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త, నాయకుడికి ఈ విషయం తెలుసు కానీ ఎవరూ చెబుతే వాళ్లు సస్పెండ్ అయిపోతారన్నారు. అందుకోసం కార్యకర్తలు గానీ నాయకులు గానీ పాపం నోరు మూసుకొని కూర్చుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్సీ కవిత లేఖ, ఈటల రాజేందర్‌కు నోటీసులపై ఎవ్వరూ నోరు జారొద్దని కిషన్ రెడ్డి హెచ్చరించిన మరుసటి రోజే రాజాసింగ్ కవితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో రాజాసింగ్ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ నడుస్తోంది.
టెర్రరిస్టుల వెనుక ఎంఐఎంకు చెందిన అడ్వకేట్ ఉన్నారు : ఎన్‌ఐఏ ఆఫీసర్లు అరెస్టు చేసిన టెర్రరిస్టుల వెనుక ఎంఐఎంకు చెందిన అడ్వకేట్ ఉన్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. టెర్రరిస్టులకు ఫిజికల్‌గా, ఫైనాన్షియల్‌గా కూడా ఎంఐఎంనే సపోర్టు చేస్తోందని అన్నారు. ఏపీ, తెలంగాణలో ఇంకెంతమంది సమీర్, సిరాజ్‌లు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులు తేల్చాలని తెలిపారు. టెర్రరిస్టులు టార్గెట్ చేశారో వారికి ఫోన్ చేసి అలర్ట్ చేయాలని అన్నారు. గతంలో గోకుల్ చాట్, సాయిబాబా ఆలయం, లుంబినీ పార్కు వద్ద బాంబు పేలుళ్లకు బలైంది పేద ప్రజలనేనని రాజాసింగ్ తెలిపారు.